ఆ రోజు బ్యాంకర్లకు మోడీ షాక్..

235
BANKERS ALSO WERE IN DARK OVER CURRENCY BAN
- Advertisement -

నవంబర్ 8న మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లధన కుబేరులు కుదేలౌతుండగా… సామాన్యుడు చిల్లర కోసం నానా కష్టాలు పడుతున్నాడు. బ్యాంకుల్లో రద్దీ పెరిగి.. బ్యాంకు ఉద్యోగులు ఓవర్ టైమ్ చేస్తున్నారు. మోడీ ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో బ్యాంకింగ్‌ రంగానికి చెందిన అధికారులు ఏ విధంగా స్పందించారు..? అసలా రోజు రాత్రి ఏం జరిగిందో ఎస్బీఐ చైర్మన్ అరుందతీ భట్టాచార్య వెల్లడించారు.

నవంబర్‌ 8, సాయంత్రం 7 గంటల నుంచి మీటింగ్‌ ఉంటుందని… దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకుల అధిపతులు, ఎండీలకు ముంబైలోని రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. సాధారణంగా మీటింగ్‌కి పిలిచేముందు ఆర్బీఐకి ఎజెండా ఉంటుంది. దాని ప్రకారమే సిద్దమై రావాలి. కానీ ఆ వేళ ఎందుకోగానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.

arundathi

మింట్ స్ట్రీట్ లోని ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ లోని 15వ అంతస్తులో టాప్ బ్యాంకర్ల సమావేశం జరిగిందని, ఈ రంగంలో కనీసం 30 సంవత్సరాల అనుభవమున్న టాప్ బ్యాంకర్లను మాత్రమే పిలిచారని ఆమె చెప్పారు. అయితే మోడీ 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించేంత వరకూ విషయం ఏంటన్నది తమకు తెలియదని అన్నారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల మొత్తం పెరగడం గురించి ఆందోళన చెందుతున్నామంటూ ఆర్బీఐ అధికారులు సమావేశాన్ని ప్రారంభించారని, ఆపై మరికొన్ని సాధారణ అంశాలను చర్చించామని తెలిపారు.

8 గంటల వేళ, గదిలోని టీవీలను ఆన్ చేశారని, ప్రధాని ప్రసంగించనున్నారని తెలిపి, ఆపై తిరిగి సమావేశం కొనసాగుతుందని ఆర్బీఐ ఉన్నతాధికారులు వెల్లడించారని అరుంధతీ వెల్లడించారు. ప్రధాని నోటివెంట పెద్ద నోట్ల రద్దును విన్నామని, అంతవరకూ తమకు విషయం తెలీదని చెప్పిన ఆమె, ప్రధాని ప్రసంగం మొదలుకాగానే, తమ పని ప్రారంభమైందని, ఆర్బీఐ కార్యాలయం నుంచే మరుసటి రోజుకు సంబంధించిన పనిని తాము ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయం మొదట విస్మయం కలిగించినా.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వచ్చి తాము చేయాల్సిన పనులపై కొంత గైడెన్స్ ఇచ్చి వెళ్లిన తరువాత, రాత్రి 9:30 గంటల సమయంలో బయట పడ్డామని, రాత్రి 10 గంటల సమయానికి అందుబాటులో ఉన్న బ్యాంకు ఉన్నతాధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమావేశమై, మరుసటి రోజు చేయాల్సిన పనుల గురించి చర్చించామని భట్టాచార్య వివరించారు. ఆ క్షణం నుంచి ఏటీఎంలను మార్చడం, ఖాతాదారులకు ఇబ్బంది కలుగకుండా చూడటం వంటి పనుల్లో తలమునకలై పోయినట్టు ఆ రోజు ఘటనను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -