బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి రావాలన్న ప్రతిపాదనను ఆ దేశ ప్రభుత్వం తిరస్కరించింది. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని ఆమె చేసిన ప్రకటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆమె తిరిగి రావాలంటే భారత్‌తో ఉన్న అప్పగింత ఒప్పందం (Extradition Treaty) ప్రకారమే రావాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, దేశంలో ఆమె రాజకీయ పునరాగమనానికి కూడా అవకాశం లేదని సంకేతాలిచ్చింది.
భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ వెల్లడించారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ జాతీయ విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఢాకాకు చేరుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు తెలిపారు.
అయితే హసీనా అభ్యర్థనపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ స్పందిస్తూ.. ఆమె కోరుకున్న విధంగా స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కాదన్నారు. వాస్తవ పరిస్థితులకు, వ్యక్తిగత ఆకాంక్షలకు మధ్య తేడా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అప్పగింత ఒప్పందం ద్వారా మాత్రమే ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకురావడం సాధ్యమని స్పష్టం చేశారు. తిరిగి వస్తే కస్టడీలోకి తీసుకుని కఠిన నిఘాలో ఉంచుతామని హెచ్చరించారు.
బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. దాదాపు 15 ఏళ్లకు పైగా కొనసాగిన ఆమె పాలనకు ఈ పరిణామంతో ముగింపు పలికింది.
ఆందోళనల సమయంలో నిరసనకారులపై జరిగిన హింసకు సంబంధించి బంగ్లాదేశ్ న్యాయస్థానం గత ఏడాది నవంబర్‌లో ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హసీనా ఖండించారు. మరోవైపు ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలపై కూడా బంగ్లాదేశ్‌లో నిషేధం కొనసాగుతోంది.
డిసెంబర్ 16 బంగ్లాదేశ్ విజయ దినోత్సవం. 1971లో పాకిస్థాన్‌పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు. ఇదే రోజున స్వదేశానికి తిరిగి రావాలని హసీనా నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమె తిరిగి రావడం, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం కావడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
హసీనా అప్పగింత విషయంలో భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఈ పరిణామాలు భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read:Nvidia:జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

