హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బండ్ల గణేష్‌..!

118
Bandla Ganesh

తెలుగు సినీ పరిశ్రమలో బండ్ల గణేష్ అంటే ఓ సంచలనం. వెండితెరపై కమెడియన్‌గా, తెర వెనుక నిలబడి అంతా నడిపించే నిర్మాతగా సత్తా చాటిన ఆయనలో ఓ స్పెషల్ క్వాలిటీ ఉంది. అదే ముక్కుసూటితనం. పవన్ కళ్యాణ్ వీరాభిమానిని, పవన్ నా దేవుడు అని చెప్పుకునే బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి బయటకొచ్చారు. 7’O క్లాక్ బ్లేడ్ డైలాగ్‌తో అప్పట్లో నానా హంగామా సృష్టించారు బండ్ల గణేష్. దాంతో రాజకీయపరమైన స్థిరత్వం రాలేదు గానీ రెట్టింపు పాపులారిటీ మాత్రం వచ్చింది. ఆ తరువాత నిర్మాతగా సినిమాలకి దూరమైన ఆయన, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్‌లో హఠాత్తుగా మెరిశాడు. ఆ తరువాత ఇకపై అలాంటి పాత్రలు చేయనని కూడా చెప్పాడు. కానీ ఇటీవల ఆయన నటన వైపు మొగ్గుచూపుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘మండేలా’ తెలుగు రీమేక్‌లో బండ్ల గణేశ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇక ఇప్పుడు మళ్లీ అలాంటి టాక్ ఒకటి బలంగానే వినిపిస్తోంది. వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు ఒక కథను తయారుచేసుకున్నాడట. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథలో, ప్రధాన పాత్రను బండ్ల గణేశ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.