తెలంగాణ రాములమ్మ, ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరుగాంచిన విజయశాంతి కాషాయ పార్టీలో కూడా ఇమడలేకపోతున్నారా..రాములమ్మ తీరుపై విసిగిపోయిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెకు పొమ్మన లేక పొగబెడుతున్నాడా…సాగర్ ఉప ఎన్నికల తర్వాత రాములమ్మ విషయం తేల్చే పనిలో బీజేపీ నాయకత్వం పడిందా…ఇప్పుడిదే అంశం కాషాయ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. విజయశాంతి ఎక్కడ ఉంటే ఆ పార్టీలో చిచ్చు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలుత టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు విజయశాంతి మంచి పేరుతెచ్చుకుంది..కేసీఆర్ కూడా తనకు దేవుడిచ్చిన చెల్లెమ్మగా గౌరవించారు. అయితే మెదక్ టీఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలను రెచ్చగొట్టడంతో కేసీఆర్ మెల్లగా విజయశాంతిని దూరం పెట్టడం మొదలుపెట్టారు. దీంతో టీఆర్‌ఎస్‌తో విబేధించిన రాములమ్మ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా రాములమ్మది అదే వరుస..కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఎడమొహం, పెడమొహంగా ఉండేది..రాజకీయాల్లో రాణించాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. కాని రాములమ్మ మాత్రం దాదాపుగా ఇంటికే పరిమితం అవుతారు.
పెద్దగా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై ఏనాడు ఆందోళనలు చేసింది లేదు..పైగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో కయ్యానికి దిగేది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చినా కాంగ్రెస్ నేతల తరపున అగ్రెస్సివ్‌గా ప్రచారం చేసింది లేదు. ఇక టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాములమ్మ తరుచుగా పేచీ పడేది. పార్టీ సమావేశాలకు తరచుగా డుమ్మా కొడుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఆమెను పిలవడమే మానేశారు. ఓదశలో రాములమ్మను పట్టించుకున్నవారే లేరు. దీంతో తెలంగాణ పీసీసీ నాయకత్వం తీరుపై విరుచుకుపడిన రాములమ్మ మళ్లీ బీజేపీలోకి వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా రాములమ్మ వరుస మారింది లేదు. ఏదో ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్‌పై దొర అంటూ నాలుగు డైలాగులు పేల్చి విరుచుకుపడడం తప్పా..పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. అసలు విజయశాంతి బీజేపీలో చేరడం అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇష్టం లేదు..పైగా తనతో సంప్రదించకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకుని మరీ రాములమ్మ పార్టీలో చేరికపై చర్చించడం బండి ఇగోను హర్ట్ చేసింది. అందుకే పార్టీలో చేరిన తర్వాత కూడా రాములమ్మతో బండి సంజయ్ పెద్దగా టచ్‌లో లేడు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం మానేశాడు.
ఒక్క గుర్రంబోడు భూముల వివాదంలో రచ్చ రేపడానికి మాత్రం విజయశాంతిని తీసుకువెళ్లాడు..అక్కడ రాళ్ల దాడి జరిగి, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినా రాములమ్మ పెద్దగా స్పందించలేదని బండి ఫీల్ అయ్యాడు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములమ్మ ప్రచారానికి దూరంగా ఉండడంపై బండి అసహనం వ్యక్తం చేశాడు. పీవీ కుమార్తె వాణిదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో బండి సంజయ్ డిఫెన్స్‌లో పడ్డాడు. ఆ సమయంలో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన రాములమ్మ ప్రచారం చేసి ఉంటే పార్టీ అభ్యర్థి రామచందర్‌రావు గట్టెక్కి ఉండేవారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక రాబోయే సాగర్ ఉప ఎన్నికలు బండి సంజయ్‌కు అగ్ని పరీక్షగా మారాయి. ఓ దశలో సాగర్ బీజేపీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ఖరారు అయిందని వార్తలు వచ్చాయి.
కాని విజయశాంతి పోటీకి ఆసక్తి చూపలేదని సమాచారం. కనీసం సాగర్‌లో ప్రచారం చేయడానికి కూడా విజయశాంతి ముందుకు రాకపోవడం బీజేపీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. సాగర్ ఎన్నికల గురించి మీడియాలో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాషాయ పార్టీని కలవరపెడుతుంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ మీడియా ముందు కనబడలేదు. విజయశాంతి తీరుపై విసిగిపోయిన బండి సంజయ్ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీలో రాములమ్మ ఉన్నా ఒకటే..లేకున్నా ఒకటే అని బండి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విజయశాంతిని పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా బండిసంజయ్, విజయశాంతి మధ్య విబేధాలు ఇప్పుడు కాషాయ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి విజయశాంతి దిగివచ్చి బండితో కలిసి సాగర్ ఉప ఎన్నికలలో ప్రచారం చేస్తుందా లేదా షరామామూలుగా ప్రచారానికి రాకుండా సోషల్ మీడియాలో ట్వీట్లకు, పోస్టులకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాలి.