బండి సంజయ్ తిరుగుబాటు.. బీజేపీలో భయం!

38
- Advertisement -

తెలంగాణ బీజేపీలో గత కొన్నాళ్లుగా అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత.. పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు.. మరి ఎక్కువయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికలకు ఎంతో సమయం లేనప్పటికి ఏ మాత్రం జోష్ కనిపించడం లేదంటే దానికి కారణం అంతర్గత విభేదాలే. అధ్యక్ష పదవి దూరమైనప్పటి నుంచి బండి సంజయ్ పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. దానికి తోడు ఈటెలకు అధిష్టానం అధిక ప్రదాన్యం ఇస్తుండడంతో బండి సంజయ్ మరింత అసంతృప్తిగా ఉన్నట్లు గత కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా తనకు అధ్యక్ష పదవి దూరమైనప్పటి నుంచి ఆ విషయంపై ఆచితూచి స్పందించిన బండి సంజయ్.. తాజాగా ఓపెన్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను తప్పిస్తారని ఊహించలేదని, అధ్యక్ష పదవి కాలం పూర్తయిన తరువాత కూడా కొనసాగిస్తామని మొదట చెప్పారని తాజాగా సంజయ్ చెప్పుకొచ్చారు.

అధిష్టానం ఇచ్చిన భరోసాతోనే పార్టీని బలోపేతం చేసేందుకు పని చేశానని.. కానీ ఊహించని రీతిలో తనను తప్పించారని అన్నారు బండి సంజయ్. మరోసారి అధ్యక్ష పదవిని ఇస్తానంటే కూడా వద్దంటా అంటూ కరాఖండిగా చెప్పేశారు. దీంతో ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు అధ్యక్ష పదవిపై బండి సంజయ్ ఇలా నోరు విప్పడంతో పార్టీలోని అంతర్గత లొసుగులు ఒక్కసారిగా బయటపడినట్లైంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని దెబ్బ తీసేలా ఉన్నాయని సొంత పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.

అయితే సి‌ఎం అభ్యర్థిగా తన పేరు ప్రస్తావించాలనే ప్లాన్ తోనే బండి ఈ కొత్త రాజకీయానికి తెర తీశారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ నేతల నుంచి ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ నుంచి సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ ఉన్నారు. ఈటెలను సి‌ఎం అభ్యర్థి గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు చేసేందుకే అధ్యక్ష పదవి విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఇలా భాహిర్గతం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:ఇప్పపువ్వుతో లాభాలెన్నో!

- Advertisement -