బద్దం బాల్ రెడ్డి మృతి దత్తాత్రేయ సంతాపం..

252
Bandaru Dattatrey
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10 నుంచి ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాల్‌రెడ్డి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.

Bandaru Dattatrey

ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. బద్దం బాల్ రెడ్డి మృతి నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీ బద్దం బాల్ రెడ్డి ప్రజా నాయకుడు, పోరాట యోధుడు, గోల్కొండ సింహంగా పేరుగాంచిన బద్దం బల్ రెడ్డి మరణం తెలుగు ప్రజలకి, ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలకు తీరని లోటు. జాతీయ భావజాలాన్ని పుణికి పుచ్చుకుని, జీవితమంతా సిద్ధాంతపరమైన రాజకీయాలకు అంకితమై అంకుఠిత దీక్షతో పనిచేశారు.

స్నేహశీలి, నీతి నిజాయితీ లకు కట్టుబడి జన్ సంఘ్ పార్టీలో నాయకునిగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీలో ఉన్నతమైన పదవులు అలంకరించి దేశ రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. బద్దం బాల్ రెడ్డి మరణం జాతీయ భావ సిద్ధాంతాలకు తీరని నష్టం. వారి మృతి పట్ల నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అని అన్నారు.. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో బాల్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల బండారు దత్తాత్రేయ ఎం పి మాజీ కేంద్ర మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -