బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిగింది. రాష్ట్ర పశు సంవర్థక, మత్య్స, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గృహనిర్మాణ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా హాజరై అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు.
ముఖ్యమంత్రి సతీమణి, మన్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమాలు అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించారు. జీహెచ్‌యంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీసమేతంగా అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. ఆషాడమాసంలో జరిగే అమ్మవారి కళ్యాణానికి ఎంతో విశిష్ఠత ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కళ్యాణోత్సవానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ఠమైన బందోబస్తు, బారికేడింగ్‌తో మహిళా పోలీసు సిబ్బందిని మఫ్టీలో నియమించినట్లు చెప్పారు. భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవారి కళ్యాణాన్ని తిలకించినట్లు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం నిర్వహించే అమ్మవారి ఊరేగింపుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.