బాహుబలి విడుదలకు ఇంకో నాలుగు రోజుల టైముంది. విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది బాహుబలి టీం ప్రమోషన్ స్పీడు పెంచింది. తాజాగా బాహుబలి 2కు సంబంధించిన ప్రోమో ఒకటి యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. బాహుబలి-2 వీడియో సాంగ్ ప్రోమోను ఈ రోజు లహరి మ్యూజిక్, టీ సిరీస్ సంయుక్తంగా విడుదల చేశాయి.
ఇందులో బాహుబలి ప్రభాస్‌లో రాజసం ఉట్టిపడుతోంది. బాహుబలి మాహిష్మతీ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించగా, అదే సమయంలో వేలాది మంది ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతూ పూలు చల్లారు. భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి అంటూ పాటను కొంత వినిపించారు. ఈ వీడియోలో కట్టప్ప, శివగామి కూడా కనిపించారు. ప్రభాస్ కత్తి తిప్పుతోన్న తీరు, యుద్ధకళను ప్రదర్శిస్తోన్న శైలి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాహిష్మతి సామ్రాజ్యంలోని సైన్యం, ఏనుగు తొండానికి అమర్చిన ఓ అతిపెద్ద విల్లు వంటి ప్రత్యేక ఆకర్షణలు అభిమానులను అలరిస్తున్నాయి. ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాట కాకుండా పాట ప్రోమోతోనే రాజమౌళి మరోసారి బాహుబలి -2 సినిమా మీద ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ వీడియో పోస్ట్ చేసిన 12 గంటల్లోనే యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా వరకు వ్యూస్ వచ్చాయంటే బాహుబలి స్టామినా ఏంటో అర్థం అవుతుంది. .
కాగా, బాహుబలి 2 ట్రైలర్ విడుదల అయిన 24 గంటల వ్యవధి లో యూట్యూబ్ సర్వర్ లని క్రాష్ చేస్తూ కేవలం ఒక్క రోజు లో రెండు కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. రెండున్నర గంటల లో కోటి మార్క్ ని చేరుకున్న ఈ ట్రైలర్ తిరుగులేని ట్రైలర్ గా ఇంటర్నెట్ లో ప్రఖ్యాతి గాంచింది.