నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. ఎన్.బి.కె ఫిలింస్ పతాకంపై రెండు పార్టులుగా కథానాయకుడు,మహానాయకుడు వస్తుండగా విద్యాబాలన్ కీలకపాత్ర పోషించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆడియో,ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య చరిత్ర అంటే మాదేనని దానికి తిరగరాయలేం అన్నారు. ఇంత త్వరగా సినిమా పూర్తవుతుందని అనుకోలేదన్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఎవరూ ఎప్పుడూ కష్టం అనుకోలేదన్నారు. ఎవరైనా నన్ను నువ్వు ఎవరివని అడిగితే భారతీయుడిని అంటాను. రెండోసారి అడిగితే తెలుగువాణ్నని అంటాను. ఇంకోసారి అడిగితే నందమూరి తారక రామారావు బిడ్డని అంటాను. మళ్లీ అడిగితే అన్నగారి అభిమానిని అంటాను. చరిత్ర సృష్టించడానికే మేము ఇక్కడున్నాం, అది పునరావృతం చేయడానికి కాదని తెలిపారు బాలయ్య.
నాన్న చేయని పాత్రల్ని కూడా నేను చేశానని నారదుడు, గౌతమీపుత్ర శాతకర్ణి పేర్లని చెప్పుకొనేవాణ్ని. అలాంటిది నాన్నగారి పాత్రనే చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదన్నారు. ఇది ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే చూడాల్సిన సినిమా కాదు, ఆబాలగోపాలమూ చూడాల్సిన సినిమా అన్నారు.