నేనూ భాగస్వామిని అవుతా.. మా ఎన్నికలపై బాలయ్య కామెంట్స్‌..!

120
Balakrishna
- Advertisement -

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల కోసం తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పుడే పోటీ మొదలైంది. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ సహా పలువురు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన ఈ ఎన్నికల గురించి అప్పుడే రగడ మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశిస్తూ కొందరు నాన్ లోకల్ అనే ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. ఇది పెద్ద చర్చకే దారి తీసింది. తాజాగా మా ఎన్నికల అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.

గతంలో ‘మా’ అసోసియేషన్‌లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారని… ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ అసోసియేషన్‌కు ఇంత వరకు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా? అని బాలయ్య ప్రశ్నించారు.

సినీ పరిశ్రమ అనేది గ్లామర్ ఫీల్డ్ అని… ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను బహిరంగ వేదికలపై చర్చించకూడదని బాలకృష్ణ చెప్పారు. అయితే ‘మా’ శాశ్వత భవన నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించగా… ఆ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని బాలయ్య చెప్పారు. అందరం కలిసి నిర్మిస్తే.. ఇంద్రభవనమే నిర్మించవచ్చని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

- Advertisement -