గౌతమీపుత్ర శాతకర్ణి,జై సింహా సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య లాంగ్ గ్యాప్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. మార్చి 29న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించనున్నాడు. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించనున్నాడు. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా ఇప్పటికే సినిమాపై భారీ హైప్ క్రియేటైంది.
దీంతో పాటు బోయపాటి శ్రీనివాస్‌తో హ్యాట్రిక్ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ అంటే బ్లాక్‌బస్టర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్. గతంలో బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా,లెజెండ్ ఘన విజయం సాధించాయి. ఇక లెజెండ్ సినిమాకు నంది అవార్డుల పంటపండింది. బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న ఈ సినిమా ప్రారంభం కానుండగా ఆగస్టులో షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం బోయపాటి…రామ్ చరణ్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలతో పాటు పూరి జగన్నాథ్-ఎస్వీ కృష్ణారెడ్డి-క్రిష్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు బాలయ్య ఆసక్తికనబరుస్తున్నాడట. క్రిష్ దర్శకత్వంలో అహం బ్రహ్మాస్మి,ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఫాంటసీ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ కోడై కూస్తోంది. దీంతో పైసా వసూల్ సమయంలోనే పూరి వినిపించిన కథ బాలయ్య తెగ నచ్చిందట. మొత్తంగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న బాలయ్య…ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు.