బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఆమెకు సికింద్రాబాద్ లోని సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. రూ. 10 వేల పూచీకత్తుతో పాటు, ఇద్దరు వ్యక్తుల షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గత 17 రోజులుగా చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో అఖిలప్రియ ఉన్నారు. ఈరోజు బెయిల్ మంజూరు కావడంతో శనివారం ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 15 రోజులకు ఒకసారి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని కోర్టు ఆమెకు సూచించింది.
మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో భార్గవ్ రామ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరారు. ఈ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉండగా, భార్గవ్ రామ్ ఏ3గా ఉన్నారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.