దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార కేసులో బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సింగార్‌కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బాధితురాలి భద్రత దృష్ట్యా ఆమెకు సీఆర్పీఎఫ్ భద్రత కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో జరిగిన ఈ ఘటనలో, మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు కుల్దీప్ సింగ్ సింగార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. అనంతరం బాధితురాలి తండ్రి కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం, బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించారన్న ఆరోపణలు మరింత కలకలం సృష్టించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కోర్టు సింగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే తాజాగా, రేప్ కేసులో విధించిన యావజ్జీవ శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ, కఠిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని, బాధితురాలిపై ఎలాంటి ప్రభావం చూపకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “నా తండ్రిని హత్య చేశారు, నాపై అత్యాచారం చేసిన వ్యక్తికి బెయిల్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం?” అంటూ ఆమె వాపోయింది. ఈ కేసులో కోర్టు తీర్పు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

