భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7500 స్క్రీన్లలో ఈ నెల 28న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఈ చిత్రం పేరిట తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందించి క్యాష్ చేసుకుంటున్న వారు లేకపోలేదు. ఈ క్రమంలో అహ్మదాబాద్ లోని రాజువాడు రెస్టారెంట్ ‘బాహుబలి-థాలి’ పేరిట ఓ మెనూని సిద్ధం చేసింది. ఈ మెనూలో వంటకాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా అయితే, థాలిలో పలు రకాల వంటకాలను ఎంచుకునే అవకాశం ఉండదు. కానీ, ‘బాహుబలి-థాలి’లో మాత్రం రాజస్థానీ, గుజరాతీ వంటకాలను రుచి చూపిస్తోంది.
అయితే ‘బాహు-థాలి’లోని వంటకాలకు బాహుబలి చిత్రంలోని పేర్లను పెట్టలేదు కానీ.. మహిష్మతి సామ్రాజ్యంలో ఉండి విందు భోజనాన్ని ఆరగించిన అనుభూతిని ఇస్తుంది. ‘ఈ వంటకాలను రాజువాడు రెస్టారెంట్ వద్ద అందిస్తున్నాం. బాహుబలి రెండో భాగం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. బాహుబలి బృందం రాజువాడులో ఆతిథ్యం స్వీకరిస్తుందని ఎదురుచూస్తుంటాం’ అని రెస్టారెంట్ యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా ఆ రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ, ‘బాహుబలి’ బృందం తమ రెస్టారెంటులో ఆతిథ్యం స్వీకరిస్తుందని కోరుకుంటున్నామని తెలిపింది.
కాగా, బాహుబలి ది బిగినింగ్.. రూ.600 కోట్ల వసూళ్లు సాధించి అంచనాలకు మించి విజయం సాధించడంతో బాహుబలి 2 రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇటీవలె సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది.