భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు, వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు.
మంత్రి అల్లోలకు వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని, భక్తులు కూడా కోవిడ్ నిబంధలను పాటించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ, వేద పండితులు, తదితరులు ఉన్నారు.