బద్నాం చేసేందుకే దాడులు

223
- Advertisement -
  • పెట్టుబడులు తరలించుకు పోయేందుకే
  • తెలంగాణను బద్నాం చేస్తేనే గుజరాత్కు ಲ
  • అవినీతి ఉందని ముద్ర వేసేందుకే…
  • బట్టకాల్చి మొహాన వేస్తున్న ఈడి, ఐటి
  • ఈడి, ఐటి దాడులన్నీ కుట్రపూరితమే..?
  • పెద్ద వ్యాపారాల్లో కోట్ల నగదు సహజమే
  • గుజరాత్లో లక్షల మంది దొరుకుతారు
  • గుజరాత్లో దాడులు చేయరెందుకో…
  • ఈడి,ఐటిలపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం

 

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేసే పనికి పూనుకుందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపరులున్నారనే ముద్రవేస్తే జాతీయ, అంతర్జాతీయంగా చెబ్బపేరు వస్తుందని, తద్వారా పెట్టుబడులన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళకుండా గుజరాత్ రాష్ట్రానికే వెళతాయనే దురుద్దేశ్యంతోనే ఇలా ఈడి, ఐటి విభాగాలతో దాడులు చేయిస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు.

వందల కోట్లల్లో కంపెనీలు నడుపుతూ వ్యాపారాలు చేసే ఎవ్వరి దగ్గరనైనా కొన్ని కోట్ల రూపాయల నగదు దొరుకుతుందని, ఈ విధంగా హైదరాబాద్ లో ఉన్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలే కాదని, గుజరాత్లోని పారిశ్రామికవేత్తల దగ్గరనైతే ఇంకా పెద్ద మొత్తంలోనే నగదు దొరుకుతుందని, కానీ ఈడి-ఐటి అధికారులకు మాత్రం ఆ రాష్ట్రం కనిపించదని మండిపడుతున్నారు.

ఈడి, ఐటి విభాగాలకు చిత్తశుద్ధి ఉంటే గుజరాత్, మహారాష్ట్రల్లోని ప్రముఖ నగరాల్లో తనిఖీలు చేస్తే కొన్ని వేల కోట్లే కాదు, లక్షల కోట్లు దొరుకుతాయని, అంతెందుకు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేతల ఇళ్ళల్లో, ఆఫీసుల్లో దాడులు చేస్తే వేల కోట్ల రూపాయల నగదు, అక్రమ లావాదేవీలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడ దారిమళ్ళాయో కూడా తెలుస్తుందని, కానీ ఐటి-ఈడీ సంస్థలు మాత్రం గుజరాత్ రాష్ట్రం జోలికి వెళ్ళరని, అదానీ గ్రూపుల జోలికి అస్సలు వెళ్ళరని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కేవలం తెలంగాణ రాష్ట్రంపైన కక్షసాధింపు చర్యలకు పూనుకునేందుకే ఈడి, ఐటి సంస్థలతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఉందని, ప్రభుత్వంలోనూ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారరంగాల్లో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను బద్నాం చేసేందుకే ఇలా ఈడి, ఐటిలతో దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు.

హైదరాబాద్లోగానీ, తెలంగాణ రాష్ట్రంలోగానీ కొత్తగా ఎవ్వరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ఈడి, ఐటి దాడులు జరుగుతుంటాయనే భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారని, ఇన్వెస్టర్లలో ఒక విధమైన భయాన్ని కలిగించడానికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక పథకం ప్రకారమే దాడులు చేయిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇలా ఈడి, ఐటి సంస్థల దాడులను బూచిగా చూపించి ఎన్నో సంస్థలను గుజరాత్కు మళ్ళించుకొన్నారని, చివరకు ఇదే బూచితోనే విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్శిటీని కూడా గుజరాత్కు తరలించుకుపోయారని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ తెలంగాణకు దక్కకుండా చేసి గుజరాత్ కు తరలించుకు పోయారని వివరించారు.

అంతేగాక అనేక ఐ.టి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొందరు అనేక హెచ్చరికలు జారీ చేశారని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టవద్దని, ఒకవేళ్ళ తెలంగాణలో పెట్టుబడులు పెట్టినా, కంపెనీలను విస్తరించినా ఈడి-ఐటి సంస్థలతో దాడులు చేయిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని కూడా ఆ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. ఇలాంటి బెదిరింపుల మూలంగా సుమారు 25 వేల మంది పారిశ్రామికవేత్తలు దేశం విడిచి పారిపోయి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో సెటిల్ అయ్యేందుకు వెళ్ళిపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయని వారు వివరించారు.

కేంద్రం వేధింపులు భరించలేకనే ధనవంతులు, పారిశ్రామికవేత్తలు వేల సంఖ్యలో దేశం విడిచి పారిపోయారని, విదేశాల్లోనే శాశ్వత నివాసాలు కూడా ఏర్పాటు చేసుకొంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ లో వాతావరణం, నదీ జలాలు, నాణ్యమైన విద్యుత్తు, పటిష్టమైన శాంతి-భద్రతలు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, త్వరితగతిన క్లియరెన్స్లు వచ్చే విధంగా ఫ్రెండ్లీగా ఉన్న పారిశ్రామిక పాలసీలను చూసి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు, పరిశ్రమలు వస్తున్నాయని, వాటిని గుజరాత్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలకు తరలించుకుపోవడానికే తెలంగాణ రాష్ట్రాని బద్నాం చేయడానికి ఢిల్లీ పెద్దలు పూనుకొన్నారని వ్యాపారవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

దీనికితోడు ఫార్మారంగంలో తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో మార్మోగిందని, దాంతో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయని, బిజెపి పాలిత రాష్ట్రాలకు వెళ్ళడంలేదని, ఆ అక్కసుతోనే తెలంగాణ బ్రాండ్ను చెడగొట్టేందుకే ఢిల్లీ పెద్దలు వ్యూహాత్మకంగా చేస్తున్న ఆపరేషన్లో భాగమే ఈడి, ఐటి దాడులని ఆ పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు.

లేకుంటే ఈ సంస్థల దాడుల్లో దొరుకుతున్న అయిదు కోట్లు, ఆరు కోట్లు, పది కోట్ల రూపాయల నగదు అనేది అస్సలు పెద్ద విషయమేకాదని, పైగా ఈ సంస్థల దాడుల్లో దొరికిన ప్రతి రూపాయికీ లెక్కలు ఉంటున్నాయని, కానీ లెక్కలు చెప్పే లోపే మీడియాకు లీకులిచ్చి బద్నాం చేస్తున్నారని, వాస్తవానికి ప్రతి రూపాయికి అందరి వద్దా తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని దాడులు చేసిన సంస్థలకు అప్పగించి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని దాడుల్లో దొరికిన నగదును వెనక్కు తీసుకువెళుతూనే ఉన్నారని వివరించారు.

కానీ దాడుల్లో దొరికిన డబ్బు మొత్తం నిఖార్సయిన నిధులేనని, అవన్నీ లెక్కల ప్రకారమే ఆయా పారిశ్రామికవేత్తల వద్ద దొరికాయని, తగిన సాక్ష్యాధారాలు చూపించడం, దాడుల్లో దొరికిన సొమ్మును విడుదల చేశామని ఇప్పటి వరకూ ఏ ఒక్క ఐటి అధికారిగానీ, ఈడి అధికారి గానీ మీడియాకు తెలియజేయకపోవడం తమను ఎంతో క్షోభకు గురిచేస్తోందని వ్యాపారవేత్తలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాగైతే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోగా దివాళా తీస్తుందని, పారిశ్రామికవేత్తల ఆత్మాభిమానంపైన ఈడి, ఐటి సంస్థలు దాడులు చేస్తున్నాయని మదనపడుతున్నారు.

వ్యాపారాలు చేయడం, పరిశ్రమలు నడపి లక్షాది మందికి ఉపాధిని కల్పించడమే నేరమన్నట్లుగా ఈడి, ఐటి సంస్థలు వ్యవహరించడం బాధాకరమని అంటున్నారు. ఇలా ఎన్నిరకాలుగా ఢిల్లీ పెద్దలు కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయలేరని, తాత్కాలికంగా వచ్చే ఎదురుదెబ్బలకు తాము భయపడేదిలేదని, ఇలాంటి దాడులతో తమ పరిశ్రమలు, కంపెనీలు, వ్యాపారాలను మూసేసుకొని గుజరాత్కు వెళ్ళేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఈడి, ఐటి సంస్థలు రాజకీయ కుట్రలకు తలొగ్గి దాడులు చేస్తున్నాయని స్పష్టమైనందునే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు పక్కాగా రికార్డులు తయారు చేసుకోవాలని ఫ్యాప్సీ జాబితాలో ఉన్న కంపెనీలన్నింటినీ సూచించామని కూడా ఆ పారిశ్రామికవేత్తలు వివరించారు.

- Advertisement -