బ్యాడ్మింటన్ దిగ్గజ అంపైర్,తెలుగు తేజం సుధాకర్ అస్తమయం

246
sudakar
- Advertisement -

ఆసియాతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్ లో దిగ్గజ అంపైర్ గా ప్రఖ్యాతి గాంచిన తెలుగు తేజం వేమూరి సుధాకర్ కరోనాతో పోరాడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. మూడు ఒలింపిక్స్ (1992 బార్సిలోనా, 1996 అట్లాంట, 2000 సిడ్నీ) లో మ్యాచ్ అఫిషియల్ గా ఆయన విధులు నిర్వహించిన సుధాకర్ ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

బ్యాడ్మింటన్ ప్రపంచం ఒక మంచి మార్గదర్శకలను కోల్పోయిందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షడు అరిశనపల్లి జగన్మోహన్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత బ్యాడ్మింటన్ కు ఆయన మృతి తీరని లోటు అని వారు విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక మ్యాచ్ లకు అంతర్జాతీయ అంపైర్ గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్ తన విలక్షణమైన పనితీరుతో కీర్తిప్రతిష్టలు సంపాదించారని వారు చెప్పారు.

బ్యాడ్మింటన్ కు ఆయన అందించిన సేవలకు గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా బీడబ్ల్యూఎఫ్ఐ ప్రదానం చేసిందని వారు తెలిపారు. ఎందరో యువ క్రీడాకారులను ప్రోత్సహించి.. వారికి మార్గదర్శనం చేసిన సుధాకర్ మృతిని జీర్ణించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గోపీచంద్, జగన్మోహన్ రావు ప్రార్థించారు. సుధాకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -