బీజేపీలో అంతర్గత పోరు..టీఆర్ఎస్ వైపు చూపు!

133
bandi

తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు తారాస్ధాయికి చేరుకుంది. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా వీరిబాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు సమాచారం. ఇదిఇలా ఉండగా తాజాగా బడంగ్ పేట్‌ కార్పొరేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ల మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరగా వీరిలో కొంతమంది టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వీరి విభేదాలకు కారణం అల్మాస్‌గూడలో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల మధ్య జరిగిన ఫ్లెక్సీ వివాదం. కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దూషించుకోవడం, పరస్పరం దాడి చేసుకోవడం, పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో విబేధాలు బట్టబయలయ్యాయి. ఓ కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు ఇబ్బడి ముబ్బడిగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మరో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు అధికారులకు, మేయర్‌కు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో కొత్తగా నిర్మించే గృహాల వద్ద, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లు చేస్తున్నారని మరో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదిఇలా ఉండగానే అల్మాస్‌గూడలో బోనాల పండుగ సందర్భంగా కోమటికుంట కట్ట వద్ద శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఫ్లెక్సీలు కట్టే సందర్భంగా సదరు కార్పొరేటర్ల కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల మధ్య కాసేపు దూషణల పర్వం కొనసాగింది. దీంతో మీర్‌పేట్‌ పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక వీరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు నేతలెవరు ముందుకురావడంతో వీరిలో ఒకరు గులాబీ గూటికి చేరే అవకాశం ఉందని స్ధానికంగా ప్రచారం జరుగుతోంది.