బీజేపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్..!

96
modi pm

దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల పట్ల మోదీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరించడం, పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటడం, గ్యాస్, నిత్యావసర వస్తువులు భారీగా పెరగడం, కోవిడ్ కట్టడిలో కేంద్రం అసమర్థత వెరసీ బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలు మండిపడుతున్నారు. మాటల ప్రధాని మోదీ కంటే మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ పాలన వందరెట్లు బెటర్ అని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాని మోదీ ప్రజాదరణ పూర్తిగా తగ్గిపోవడం బీజేపీ వర్గాలకు షాకింగ్ మారింది. గత ఏడాది ఆగస్టులో 66 శాతంగా ఉన్న పాపులారిటీ ప్రస్తుతం 26 శాతమే నమోదైనట్లు ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది.

తదుపరి ప్రధానిగా ఎవరుండాలి.. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయగలరా.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటీ అనేవాటిపై ప్రధానంగా ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది జనవరికే మోదీ పాపులారిటీ 66 శాతం నుంచి 38 శాతానికి పడిపోగా.. ఇప్పుడది మరింత క్షీణించి 26 శాతానికి చేరింది. మోదీ క్రేజ్‌ రానురాను తగ్గిపోవడంపై కమలనాథుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే దేశ ఉత్తమ ప్రధానిగా 24 శాతం మంది మోదీవైపు మొగ్గుచూపడం గమనార్హం.. తర్వాతి స్థానంలో (11%) యోగి ఆదిత్యనాథ్‌ నిలిచారు. మూడో స్థానంలో (10%) ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాపులారిటీ గత ఏడాదితో పోల్చితే రెండు శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. అలాగే ప్రధానిగా మోదీ స్థానాన్ని భర్తీచేసే సత్తా అమిత్‌షాకు మాత్రమే ఉందని 29% మంది అభిప్రాయపడగా.. 19 శాతం మంది యోగికి మద్దతుగా నిలిచారు. ఎన్‌డీఏ ఆర్థిక విధానాల వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలే ఎక్కువ లబ్ధి పొందాయని 46 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవరించాలని 57 శాతం మంది భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.

ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం కావడమేనని 29 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే వెల్లడించింది. 370 అధికరణ రద్దే భారీ విజయమని 22 శాతం మంది పేర్కొన్నారు. కాగా.. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అతిపెద్ద వైఫల్యమని తేలింది. నిరుద్యోగాన్ని అరికట్టకపోవడంపైనా అసంతృప్తి నెలకొంది. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కొవిడ్‌ మహమ్మారి అని సర్వేలో అత్యధికులు (28%) అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలే పెద్ద సమస్యని 19 శాతం మంది, నిరుద్యోగమేనని 17 శాతం మంది తెలిపారు. రాహుల్‌ కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలరని 17% మంది పేర్కొనగా..14% మన్మోహన్‌సింగ్‌ వైపు మొగ్గుచూపారు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడేందుకు అవకాశం ఉందని 49% భావించారు. సదరు కూటమిని రూపుదిద్దే సత్తా కేజ్రీవాల్‌కు ఉందని 20%, మమత చేయగలరని 17% మంది అభిప్రాయపడినట్లు సర్వే పేర్కొంది. కాగా 2019 లో అఖండ విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజా వ్యతిరేకత విధానాలతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారు. ప్రస్తుతం మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లో మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ఎదురీత తప్పదనే చెప్పాలి. కాకపోతే ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం బీజేపీకి ప్లస్‌గా మారింది. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపై వచ్చి ఉమ్మడిగా పోరుకు సిద్ధమైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గడ్డుకాలమే చెప్పాలి. మొత్తంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాని మోదీ పాపులారిటీ తగ్గిపోవడం బీజేపీ నేతలను టెన్షన్ పెట్టిస్తోంది.