ప్రముఖ తెలుగు దర్శకుడు, ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభాశాలి రాజమౌళి దాదాపు వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరైనా వ్యక్తిని గానీ, ఏదైనా వర్గాన్ని కానీ ఇబ్బంది పెట్టే పనులు అస్సలు చేయరు. అయితే రాజమౌళి ఇప్పుడు ఒ వివాదంలో చిక్కుకున్నారు. తనకు తెలియకుండానే ఒక వర్గం ఆగ్రహానికి గురయ్యాడు. ప్రముఖ హేతువాది.. ఇండియన్ హ్యూమనిస్ట్- రేషనలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని రాజమౌళి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తాను నాస్తికుడినంటూ రాజమౌళి గతంలో ఒకట్రెండు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఐతే పైకి నాస్తికుడినని చెప్పుకుంటూ దానికి విరుద్ధంగా రాజమౌళి ప్రవర్తిస్తున్నాడని బాబు గోగినేని అన్నారు. రాజమౌళి లాంటి వాళ్ల వల్ల తమ లాంటి నిజమైన నాస్తికులం ఇబ్బంది పడుతున్నామని.. రాజమౌళి తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు. ఓ ఇంటర్వ్యూలో తాను నాస్తికుడిని అని చెప్పుకున్న రాజమౌళి.. ఆ తర్వాత రెండ్రోజులకే చొక్కా విప్పేసి కండువా వేసుకుని ఒక బ్రాహ్మణుడితో కలిసి లాంఛనంగా గుడికి వెళ్లారని బాబు అన్నారు. రాజమౌళి గుడికి వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే అలాంటివి చేస్తూ తాను నాస్తికుడిని అని చెప్పుకోవడమే సరికాదని ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా బాబు అభిప్రాయపడ్డారు.
నాస్తికుడంటే దేవుడు లేడు అని నమ్మేవాడని.. తనలా దేవుడు లేడని నమ్ముతూ బతికే వాళ్లు చాలామంది ఉన్నారని.. ఈ ప్రపంచంలో వంద కోట్ల మందికి పైగా మతం లేకుండా.. దేవుడిని నమ్మకుండా ఉంటున్నారని.. కానీ రాజమౌళి నాస్తికుడినని చెబుతూ గుడికి వెళ్లడం ఏమిటని బాబు ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ల వల్ల తమ లాంటి వాళ్లు బద్నాం అవుతున్నామన్నారు. గతంలో సీపీఐ నారాయణ కూడా ఇలాగే ప్రవర్తించారని.. రాజమౌళికి ఈ విషయంలో తాను సంధించిన ప్రశ్నలకు జవాబు రాలేదని.. ఆయన తప్పు చేశారు కాబట్టి సమాధానం ఇవ్వలేరని భావిస్తున్నట్లు బాబు అభిప్రాయపడ్డారు.