మల్టీ నేషనల్ కంపెనీలను దెబ్బతీస్తున్న యోగా గురువు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ నుంచి ఇక జీన్స్ ప్యాంట్లు రానున్నాయి. ఇప్పటికే పతంజలి మ్యాగీ.. పతంజలి ఫేస్‌క్రీం.. పతంజలి హనీ.. ఇలా ఆహర, ఆరోగ్య, గృహోపకరణాల రంగాల్లో మార్కెట్లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న పతంజలి.. తాజాగా వస్త్రవ్యాపారంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే పతంజలి బ్రాండ్ నుంచి దుస్తులు రానున్నాయని సమాచారం.
మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం స్వదేశీ దుస్తులను పతంజలి తయారు చేస్తోందని… వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వీటిని తీసుకొచ్చే యోచనలో ఉందని పతంజలి ఆయుర్వేద్ అధికార ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా చెప్పినట్లు ఓ మీడియా పత్రిక పేర్కొంది. తొలి దశలో భాగంగా.. దేశవ్యాప్తంగా 250 రిటేల్ అవుట్‌లెట్ల ద్వారా ఈ దుస్తులను అమ్మునున్నారు. ఏడాదికి రూ.5వేల కోట్ల విలువైన అమ్మకాలే లక్ష్యంగా దుస్తులను తయారుచేసినట్లు తిజారావాలా చెప్పారు. బిగ్‌బజార్ లాంటి స్టోర్లలోనూ ఈ దుస్తులను అందుబాటులో ఉంచనున్నారట.
గతేడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో దుస్తుల మార్కెట్లోకి వస్తున్నట్లు బాబా రాందేవ్ చెప్పారు. సంప్రదాయ కుర్తా-పైజామాతో పాటు జీన్స్ లాంటి విదేశీ దుస్తులను కూడా తీసుకొస్తామని చెప్పారు.