అఫిషియల్: రూ. 1000 కోట్ల బాహుబలి..

351
- Advertisement -

‘బాహుబలి 2:ద కన్ క్లూజన్’ సినిమా అనితరసాధ్యమైన వసూళ్లతో భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతోంది. ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘బాహుబలి-2’ రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి భారత చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.వెయ్యికోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. ఈ చిత్రం ఇండియాలో రూ. 800 కోట్లు, విదేశాల్లో రూ. 200 కోట్ల కలెక్షన్లను దాటేసిందని, ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదేనని విశ్లేషకులు వెల్లడించారు.

Baahubali: The conclusion Rs 1000 poster

ఈ సందర్భంగా ‘బాహుబలి’ ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.‘‘నా ఫ్యాన్స్‌ అందరికీ.. నాపై మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోని ప్రేక్షకుల ఆదరణ పొందడానికి నా ప్రయత్నం నేను చేశాను. మీ ఆదరణ చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. బాహుబలి చిత్రం ఓ సుదీర్ఘ ప్రయాణమే అయినా ఈ సినిమా నుంచి నేను ఆశించే వాటిలో మీరంతా కూడా ఉన్నారు. నాపై నమ్మకంతో జీవితంలో ఒక్కసారి లభించే ఇలాంటి అవకాశం ఇచ్చి, ఈ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన ఎస్‌.ఎస్‌ రాజమౌళికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.’’ అని పేర్కొన్నారు ప్రభాస్‌.

వసూళ్ల సునామీ మరో వారం పాటు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రూ. 1000 కోట్ల వసూళ్ల పైనే విశ్లేషిస్తూ కూర్చున్న వారంతా ఇప్పుడు రూ. 1500 కోట్ల మార్క్ వైపు చూస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు అంతకన్నా ఎక్కువే ఉంటాయని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. వేసవి సెలవులతో పాటు పోటీలో చిత్రాలేమీ లేకపోవడంతో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ వున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -