బాహుబలి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బాహుబలి చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని మంత్రి తలసానిని సచివాలయంలో కలిశారు. తెలంగాణలో ఐదు ప్రదర్శనలకు అనుమతివ్వాలని మంత్రిని ప్రసాద్ కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. నిర్మాత కోరిన విధంగా ఐదు ప్రదర్శనలకు అనుమతిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోను త్వరలోనే విడుదల చేస్తామని తలసాని అన్నారు.
వందేళ్ల చరిత్రలో ఒక సినిమా కోసం ఇంతగా ఎవ్వరు ఎదురు చూడలేదన్న మంత్రి… తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి చిత్రాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఇది మన సినిమా.. అందరం ప్రమోట్ చేయాలని కోరారు. బాహుబలి చిత్ర నిర్మాత, డైరెక్టర్, చిత్ర యూనిట్ కు మంత్రి శుభాకాంక్షలు చెప్పారు. సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల నియంత్రణపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. టికెట్ విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగేలా చూస్తామని తెలిపారు. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి.
తెలంగాణలో ఐదు షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనందుకు రాష్ర్ట ప్రభుత్వానికి చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వాన్ని ఆహ్వానించామని ప్రసాద్ తెలిపారు.