విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు..

175
vinod kumar

ఈనెల 24 నుంచి 26వ తేదీలలో నిర్వహించ తలపెట్టిన పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్ల ఎంట్రన్స్ తేదీలను మార్చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ అప్పారావుకు మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని యూజీసీ చైర్మన్ కు కూడా పంపారు. ఏకకాలంలో పలు పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరానికి నష్టం జరుగుతుందని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని వినోద్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులకు ఫైనల్ ఇయర్/ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి అక్టోబర్ 13 వ తేదీ వరకు జరుగనున్నాయని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్.టీ.ఏ ) కూడా యూజీసీ నెట్ పరీక్షలను ఈనెల 24 వ తేదీ నుంచి నిర్వహించనుందని వినోద్ కుమార్ తెలిపారు. ఇలాంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించ తలపెట్టిన ఎంట్రన్స్ తేదీలను మార్చాలని వినోద్ కుమార్ వైస్ ఛాన్సులర్ కు రాసిన లేఖలో కోరారు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో ఆరు సూత్రాల ఫార్ములా, ఆర్టికల్ 371 ( డీ ) ప్రకారం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. భేషజాలకు వెళ్లకుండా రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంట్రన్స్ తేదీలను మార్చాలని వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సులర్ ను కోరారు.