కేంద్ర మంత్రికి బి వినోద్ కుమార్ లేఖ..

262
vinod kumar
- Advertisement -

రాష్ట్రం నుంచి గత టర్మ్ 16 వ లోక్ సభ, రాజ్యసభ లకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుల ఎంపీ ల్యాడ్స్ బకాయి నిధులు రూ. 150 కోట్లు చెల్లించేందుకు బడ్జెట్ లో చిల్లిగవ్వ లేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ లు వినోద్ కుమార్ శుక్రవారం లేఖ రాశారు.

ఏడాదిన్నర కాలంగా ఇంకా పెండింగులో ఉన్న రూ. 150 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గత టర్మ్ 15 మంది లోక్ సభ సభ్యులకు రూ. 95 కోట్లు, ఆరుగురు రాజ్యసభ సభ్యులకు రూ. 55 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ బకాయిలు చెల్లించకుండా ఏడాదిన్నర కాలంగా తాత్సారం చేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీలు మంజూరు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులు పూర్తి అయినా ఏడాదిన్నర నుంచి నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదని వినోద్ కుమార్ అన్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో 17వ లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు 2020-21, 2021-22 సంవత్సరాల కాలంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇవ్వలేమని కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని, కానీ గత టర్మ్ 16 వ లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఎంపీ ల్యాడ్స్ బకాయి నిధులను కూడా నిలిపి వేయడం శోచనీయమని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టర్మ్ ఎంపీ ల్యాడ్స్ బకాయి నిధులు విడుదల చేయాలని కేంద్ర గణాంక శాఖ అధికారులకు తాను లేఖ రాయగా, బడ్జెట్ లో నయా పైసా లేదని సమాధానం వచ్చిందని, ఈ తీరు తీవ్ర అభ్యంతరకరమని, కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు.గత టర్మ్ 16 వ లోక్ సభ ఎంపీ ల్యాడ్స్ బకాయిలు రూ. 150 కోట్లు వెంటనే విడుదల చేయాలని వినోద్ కుమార్ కేంద్ర మంత్రి కి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

- Advertisement -