వినియోగదారుల హక్కులను కాపాడాలి: వినోద్ కుమార్

40
B Vinod Kumar

వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విషయంలో వినియోగదారులు మోసాలకు గురవుతున్నారని అన్నారు.

మోసాల బారి నుంచి వినియోగదారులకు కాపాడేందుకు 1986లో జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు చట్టాన్ని తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. ఈ చట్టాన్ని మరింత పదును పట్టి 2019 లో కొత్త వినియోగదారుల చట్టం అమలులోకి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరిలో హైదరాబాద్ లో వినియోగదారుల సంఘాలు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రభుత్వ ప్రతినిధిగా తాను హాజరు కానున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

వినియోగదారుల హక్కుల కోసం కృషి చేస్తున్న సంఘ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా కవి జయరాజ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు అంబు రాథోడ్, ప్రధాన కార్యదర్శి శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.