సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ప్రణాళికా, వ్యవసాయ, సహకార, నీటి పారుదల, విద్యుత్ రంగాలతోపాటు పలు అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అంశాలను వినోద్ కుమార్ ఆయనకు తెలిపారు. కాళేశ్వరం, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ వంటి పలు ప్రాజెక్టుల ద్వారా బీడు భూములను సైతం సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోహన్ కందా కు వినోద్ కుమార్ వివరించారు.
రానున్న రోజుల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైతు బంధు పథకం పక్కాగా అమలు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వినోద్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా మోహన్ కందా మాట్లాడుతూ.. వ్యవసాయ, సహకార, నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోందని అన్నారు. సహకార రంగంలో, రాష్ట్ర సహకార బ్యాంకు, 9 డి సి సి బీ లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలలో మౌలిక, నిర్మాణాత్మక మార్పులు జరగాల్సిన ఆవశ్యకత ఉందని మోహన్ కందా అన్నారు.
రాష్ట్రంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని మోహన్ కందా సూచించారు. పుష్కలంగా సాగునీటి వనరులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రావడంతో రైతులు సంతోషంగా పంటలు పండించే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని మోహన్ కందా అభినందించారు.
వ్యవసాయాన్ని బతుకుదెరువు కోణం నుంచి వాణిజ్య మార్గంలోకి తీసుకెళ్లాలని, తద్వారా రైతులు మరింతగా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని మోహన్ కందా అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రణాళికా సంఘం పాత్ర అత్యంత కీలకమైందని మోహన్ కందా తెలిపారు. అన్ని శాఖలకు దిశానిర్దేశం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రణాళికా సంఘానిదే అని కందా నొక్కి చెప్పారు.