“వైరల్ లోడ్” అత్యంత ప్రమాదకరం- వినోద్

414
B Vinod Kumar
- Advertisement -

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను మరింత ప్రబలిస్తున్న ” వైరల్ లోడ్ ” అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా సహా పలు దేశాల యూనివర్సిటీలలో ప్రొఫెసర్‌గా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిగా, ఎయిమ్స్ డైరెక్టర్‌గా, ఇండియన్ హెల్త్ మ్యాగ్జిన్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉన్న డాక్టర్ కే శ్రీనాథ్ రెడ్డి, ఆ సంస్థకు హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సౌత్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జీ వీ ఎస్ మూర్తిలతో వినోద్ కుమార్ ఆదివారం కరోనా అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

కరోనా వైరస్ విజృంభన, దానిపై పోరాటానికి అనుసరించాల్సిన మార్గాలపై వారితో వినోద్ కుమార్ విపులంగా మాట్లాడారు. శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక గదిలో గాని, జన సమూహం ఉన్న హాలులో గానీ ఉంటే పలువురు, పలుమార్లు వారి వద్దకు రాకపోకలు సాగిస్తే సహజంగా ఆ వ్యాధి ఆయా వ్యక్తులకు సోకి ” వైరల్ లోడ్ ” గా పరిణమిస్తుందన్న విషయాలను వైద్య నిపుణులు నిర్ధారించారని వినోద్ కుమార్ వివరించారు.

శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలున్న వ్యక్తితో వారి కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరిపినా, శుభకార్యాలు, సమావేశాలు, ఆయా మతాల కార్యక్రమాల నెపంతో పెద్ద సంఖ్యలో జనాలు ఒకే చోట గుమిగూడినా ” వైరల్ లోడ్ ” కు కారకులు అవుతారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అంటే.. రోగ లక్షణాలు ఉన్న వ్యక్తి చుట్టూ ఎవరైనా పలుమార్లు తిరిగితే.. ఆ వ్యక్తి కి ఉన్న రోగ తుంపర్లు పదేపదే అవతలి వ్యక్తి కి చేరడం వల్ల వైరల్ భారం ” వైరల్ లోడ్ “గా మారుతుందని వినోద్ కుమార్ విశ్లేషించారు.

మూకుమ్మడి భేటీలకు దూరంగా ఉండటం ద్వారా ” వైరల్ లోడ్ “ను నివారించేందుకు అవకాశం ఉంటుందని వినోద్ కుమార్ తెలిపారు. కఠిన స్వీయ నియంత్రణ మాత్రమే వైరల్ లోడ్ కు ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు. అన్నింటి కన్నా ఉత్తమ మార్గం సోషల్ డిస్టెన్స్‌ను పాటించడమేనని వినోద్ కుమార్ సూచించారు. ఇదే విధానాన్ని మరో రెండు నెలలు కనీసంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో నియంత్రణలోనే ఉందని, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఇది సమస్యగా మారిందని వినోద్ కుమార్ అన్నారు. ట్రాక్, ట్రేస్, ట్రీట్ విధానం అనుసరణీయమని, ఈ విధానాన్ని విధిగా అమలు చేస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వినోద్ కుమార్ చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ కే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ముందస్తుగా క్రియాశీల కార్యాచరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో సీఎం కేసీఆర్ దేశానికే దిశా నిర్ధేశం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

- Advertisement -