ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఆ పార్టీపై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా మరింత ఘాటుగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. హస్తం పార్టీ తనపై క్షిపణులు ప్రయోగించిందని, అయితే వాటిని కేవలం రైఫిల్‌తో నాశనం చేశానని అన్నారు. ఒక వేళ తాను బాలిస్టిక్ మిస్సైల్‌ని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారంటూ పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేశారు.
గురువారం జమ్ము కశ్మీర్‌లోని భదర్‌వాలో జరిగిన బహిరంగ సభలో గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. వారు (కాంగ్రెస్) నాపై క్షిపణులను ప్రయోగించారు. నేను 303 రైఫిల్‌తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను. వాటిని ధ్వంసం చేశాను. నేను బాలిస్టిక్ మిస్సైల్‌ని ఉపయోగిస్తే ఏమి జరిగేది? వారు అదృశ్యమయ్యేవారు అని విమర్శించారు.
కాగా, దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని గులాం నబీ ఆజాద్ అన్నారు. 52 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్న తాను ఇందిరా గాంధీని తల్లిగా, రాజీవ్ గాంధీని సోదరుడిగా భావించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని విమర్శించే ఉద్దేశం తనకు లేదన్న ఆయన, వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని చెప్పారు.