దేశంలోని ప్రముఖ మందిరాల్లో ఒకటిగా భవ్య దివ్య రామ మందిరం నిర్మితమవుతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చెప్పింది. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా నిర్మితమవుతుందన్నారు. తాజాగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణంకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈ గర్బగుడి భక్తుల కోసం తెరవబడుతుందన్నారు.
అయోధ్యలోని నిర్మితమవుతున్న శ్రీ రామ జన్మభూమి మందిర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఏడాది జూన్ లో గర్భ గృహానికి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా గర్భగృహంలో రాళ్లు ఉంచే వేడుకలో ఆయన భాగస్వామ్యం అయ్యారు.
రామాలయ నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు ఇంజనీర్లు ఆగస్టులో తెలియజేశారు. ప్రస్తుతం ప్లింత్ నిర్మాణం జరుగుతున్నాయని, ఈ ఆలయ నిర్మాణాన్ని గర్బగుడి ప్రాంతం నుండి ప్రారంభించామని పర్యవేక్షక చీఫ్ ఇంజినీర్ జగదీష్ తెలిపారు.
ఆలయ గోడలకు రాజస్థాన్‌కు చెందిన గులాబీ రంగు ఇసుకరాయిని ఉపయోగిస్తున్నారు. ఈ ప్లింత్లో ఉపయోగించిన రాళ్లను ఎత్తడానికి భారీ క్రేన్లను ఉపయోగించారు. రామాలయం గర్భగుడిలో ఉపయోగిస్తోన్న తెల్లటి పాలరాతిని రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుంచి తెచ్చినట్టు ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రామజన్మభూమి ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గర్భగుడి కోసం 6.37 లక్షల క్యూబిక్ అడుగుల గ్రానైట్, 4.70 లక్షల క్యూబిక్ అడుగుల చెక్కిన గులాబీ ఇసుకరాయి,13,300 క్యూబిక్ అడుగుల మక్రానా తెలుపు రంగులో ఉన్న చెక్కిన పాలరాయిని ఉపయోగించనున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది.
2020 ఆగస్టులో అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం నిర్వహించిన ‘భూమి పూజ’, శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇక క్యూబిక్ ఆకారంలో నిర్మితమవుతోన్న భగవాన్ వాల్మీకి ఋషి, కేవత్, మాతా శబరి, జటాయు, మాతా సీత, గణేష్ మరియు లక్ష్మణ్ ఆలయాలు కూడా ఈ ప్రణాళికలో ఉన్నట్టు తెలిపారు.