అయోధ్య శ్రీరాముడిదే..

245
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రామజన్మ భూమి ‘అయోధ్య’ అంశం మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాదాస్పద అయోధ్య భూమి ముమ్మాటికి శ్రీరాముడిదేనని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉమాభార‌తి ఈ అంశంలో ఎటువంటి సందేహాలు అవ‌స‌రం లేదని వ్యాఖ్యానించారు.

Rammandir

రామజన్మభూమి వివాదానికి కేంద్రమైన అయోధ్యలో రామాయణ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. హిందువుల ఓట్లకు గాలం వేసేందుకే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుందని మరోవైపు విపక్షాలు మండిపడుతున్నాయి. వివాదాస్పద రామజన్మభూమి ఆలయం, బాబ్రీ మసీదుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 25 ఎకరాల స్థలంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలాన్ని పరిశీలించేందుకు, అనంతరం రామాయణ సర్క్యుట్ అడ్వయిజరీ బోర్డుతో భేటీ కావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ నేడు అయోధ్య వెళుతున్నారు.

ram

ఈ విషయాలపై స్పందించిన శర్మ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సందర్శించి, రాముడి జీవితం గురించి, రామాయణం గురించి తెలుసుకొనేవిధంగా ఈ మ్యూజియం ఏర్పాటుచేస్తామని అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి షీలా దీక్షిత్ స్పందించారు. ప్రతి ఒక్కరూ రాముడ్ని ఆరాధిస్తారు. కానీ, ఎన్నికలకు కొన్ని నెలలే ముందే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. ఇందులో మతపరమైన కోణం కనిపిస్తోంది. అయోధ్య వేదికగా ఇలాంటి చర్యలు చేపట్టడం యూపీపై ప్రభావం చూపుతుంది అని విమర్శించారు. ఇదే సమయంలో మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం గర్హనీయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ప్రయోజనం పొందడం గర్హనీయమని ఆమె వ్యాఖ్యానించారు.

- Advertisement -