రెండో వన్డేలో టీమిండియా పరాజయం..

131
Australia

ఆదివారం సిడ్నీలో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 51 పరుగుల తేడాడో ఓడింది. అన్ని రంగాల్లో భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌(104: 64 బంతుల్లో 14ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు సెంచరీ చేయగా.. డేవిడ్‌ వార్నర్‌(83: 77 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), ఫించ్‌(60: 69 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌), లబుషేన్‌(70: 61 బంతుల్లో 5ఫోర్లు), మాక్స్‌వెల్‌(63 నాటౌట్:‌ 29 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారించారు. పసలేని భారత బౌలింగ్‌లో ఆసీస్‌ హిట్టర్లు సునాయాసంగా భారీ షాట్లు ఆడారు. టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ 50+ స్కోర్లు సాధించడం విశేషం. ఏడు ఓవర్లు వేసిన నవదీప్‌ సైనీ వికెట్‌ తీయకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 338 పరుగులకే ఆల్‌ అవుట్‌ అయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(89: 87 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(76: 66 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) పోరాడినా టీమ్‌ఇండియాకు ఒటమి తప్పలేదు. 50 ఓవర్లలో భారత్‌ 9 వికెట్లకు 338 పరుగులే చేసింది. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌(3/67), హేజిల్‌వుడ్‌(2/59), ఆడమ్‌ జంపా(2/62) భారత్‌ను దెబ్బకొట్టారు. తొలి వన్డేలో కోహ్లీసేన 66 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

390 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. రెండు బంతుల వ్యవధిలో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(28), మయాంక్‌ అగర్వాల్‌(28) పెవిలియన్‌ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌(38) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హెన్రిక్స్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ ఔటైనా మరో ఎండ్‌లో కోహ్లీ జోరు ఏ మాత్రం తగ్గించలేదు. రాహుల్‌ నిలకడగా ఆడుతుండగా కోహ్లీ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. 35 ఓవర్లో విరాట్‌ వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్‌ వేసిన ఐదో బంతిని షాట్‌ ఆడేందుకు యత్నించిన కోహ్లీ.. హెన్రిక్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో రాహుల్‌ దూకుడుగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌, పాండ్య జోడీ టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేయాలని భావించిన ఆసీస్‌ బౌలర్లు వీరిద్దరినీ పెవిలియన్‌ పంపడంతో విజయంపై భారత్‌ ఆశలు వదులుకున్నది.