నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఈసారి ప్రత్యేకంగా నిలిచింది. సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది నామినేషన్ వేయడంతో గ్రామంలో పోటీ హోరెత్తే అవకాశం కనిపించింది. అయితే గ్రామ పెద్దలు, అభ్యర్థులు కలిసి చర్చించిన తరువాత, గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో సర్పంచ్ పదవిని వేలంపాటకు పెట్టగా, రూ.73 లక్షలు ప్రకటించిన మహమ్మద్ సమీనా ఖాసీం వేలంలో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని వినియోగించడానికి సమీనా ముందుకు రావడం గ్రామస్తుల్లో ప్రశంసనీయంగా మారింది.
వేలంపాట ఫలితాన్ని అంగీకరిస్తూ మిగతా 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారయ్యింది.
ప్రస్తుతం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, గ్రామంలో ఏకగ్రీవ నిర్ణయంపై సంతోషం నెలకొంది. గ్రామాభివృద్ధికి భారీ నిధులు సమకూరనున్నాయనే ఆశతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీస్

