బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బళ్లారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం, మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో వివాదం చెలరేగింది. గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ప్రయత్నించగా, దీనిని గాలి అనుచరులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో సతీష్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి గన్‌మన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కొని రెండు రౌండ్లు కాల్చినట్లు సమాచారం. అయితే అప్రమత్తమైన గాలి జనార్దన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతరం ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఘటన సమాచారం అందగానే పోలీసులు భారీగా బళ్లారిలో మోహరించారు. నగరంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా 144 సెక్షన్‌ను అమలు చేశారు. కీలక రాజకీయ నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే, బయటి వ్యక్తులు నగరంలోకి ప్రవేశించకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన వెనుక రాజకీయ ప్రేరణ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బళ్లారి నగరం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లగా, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.
Also Read:నితీశ్ కుమార్..ఆస్తులెంతో తెలుసా?

