కోట్లాది భారతీయులతో 70 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్. పేదవాడి బెంజ్ కారుగా భారత్‌లో ఓ వెలుగు వెలిగిన అట్లాస్ సైకిల్ లాక్ డౌన్‌తో పూర్తిగా మూతపడింది. దీంతో ఇకపై చరిత్ర పుస్తకాల్లో మాత్రమే అట్లాస్ సైకిల్ ఉండనుంది.
1951లో ఓ చిన్న షెడ్డులో హర్యానాలో ప్రారంభమైన అట్లాస్ కంపెనీ 1965 నాటికి దేశంలో సైకిల్ తయారీలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది.600 స్టోర్‌లతో, 14 రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించింది.ప్రతి ఏడాది 4 మిలియన్ల సైకిళ్లను ఉత్పత్తి చేసింది.1978లో ఫస్ట్ రేసింగ్ సైకిల్‌ను భారతీయులకు పరిచయం చేసింది.
అయితే మారుతున్న కాలం అట్లాస్ సైకిల్‌పై పూర్తిగా ప్రభావం చూపింది. కొన్ని సంవత్సరాలుగా సైకిళ్లు కొనుగోలు చేసే వాళ్లు తగ్గిపోవడం, దేశంలో మోటారు వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో సైకిళ్ల ఉత్పత్తిని అట్లాస్ సంస్థ తగ్గిస్తూ వచ్చింది.ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని యూనిట్‌ను 2014లో, సొనపట్‌లోని యూనిట్‌ను 2018లో మూసివేసింది.ఇప్పుడు తాజాగా జూన్ 3న యూపీలోని సాహిబాబాద్‌లోని చివరి యూనిట్‌ను కూడా మూసివేయడంతో సుమారు 1,000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.