అమెరికాలోని వాషింగ్ టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) 17వ మహా సభలు – యూత్ కన్వెన్షన్ కు అతిథిగా రావాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రిని కలిసి ఆ ప్రతినిధి బృందం, సభ్యులు మాట్లాడుతూ, 1990లో ఏర్పడిన ఈ సంఘం అమెరికాలో తెలుగు కళలు, సంప్రదాయాలు, సంస్కృతీ పరిరక్షణకు పాటుడపడుతున్నదన్నారు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ మహా సభలలో వివిధ రంగాలకు చెందిన తెలుగు వాళ్ళని పిలిచి వివిధ అంశాలపై చర్చిస్తామని వారు తెలిపారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఆటా సభలకు తాను గతంలోనూ వెళ్ళానన్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగగా గొప్పగా నిర్వహించుకునే ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. ఆటా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తాను తప్పక వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆటా సంఘం ప్రతినిధులు జయంత్ చల్లా, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, భువనేశ్ బుజాల, సన్నీ రెడ్డి తదితరులు ఉన్నారు.