అగ్రరాజ్యంలో మరో మారణకాండ..

186
- Advertisement -

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇటీవలే న్యూయార్క్‌లో ఓ ఐసిస్‌ ఉగ్రవాది ట్రక్కుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే అమెరికాలో మరో మారణకాండ చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఓ చర్చిలో ఆదివారం నెత్తురు చిందింది. ఇక్కడి సుదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో ఉదయం 11.30గంటల సమయంలో సుమారు 50 మంది ప్రార్థనల్లో ఉండగా ఓ ఆగంతకుడు లోపలికి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయక ప్రజలు బలయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.

At least 26 people killed after Texas church shooting

మృతుల్లో ఐదేళ్ల చిన్నారి నుంచి 70ఏళ్ల పైబడిన వృద్ధులు కూడా ఉన్నారు. ఓ గర్భిణి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగుడు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. దుండగుడు తన తుపాకీని చర్చిలోనే వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. ఈ చర్చికి కొద్ది దూరంలో ఉన్న గ్వాడాలుపే కౌంటీలో దుండగుడు తన వాహనంలోనే మృతిచెంది కన్పించాడు. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. దీనిపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దుండగుడిని 26ఏళ్ల డేవిన్‌ పి. కెల్లీగా గుర్తించారు. శాన్‌ అంటానియో సమీపంలోని కోమల్‌ కౌంటీకి చెందినవాడని అధికారులు తెలిపారు.

- Advertisement -