ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

250
Asian Games 2018
- Advertisement -

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌ ఆదివారం ట్రాక్‌పై మూడు పతకాలను చేజిక్కించుకుంది. మూడూ రజతాలే. మహిళల 100మీ పరుగులో చక్కని ప్రదర్శన చేసిన ద్యుతి చంద్‌ అతి స్వల్ప తేడాతో పసిడి పతకం చేజార్చుకుంది. బహ్రెయిన్‌ అమ్మాయి ఒడియాంగ్‌ ఎడిడియాంగ్‌ 11.30 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి పసిడి నెగ్గగా.. 11.32 సెకన్లతో ద్యుతి రజతం సొంతం చేసుకుంది. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ మహిళల 400మీ పరుగులో హిమ దాస్‌ రజతం సాధించింది. రెండు రోజుల్లో హిమకు ఇది రెండో జాతీయ రికార్డు. బహ్రెయిన్‌కు చెందిన సల్వార్‌ నాజర్‌ 50.09 సెకన్లతో స్వర్ణం నెగ్గగా.. 50.59 సెకన్లతో హిమ రెండో స్థానంలో నిలిచింది.

Asian Games 2018

జాతీయ రికార్డు సమయం (51.00)తో హిమ శనివారం ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. నైజీరియాలో జన్మించిన సల్వార్‌ 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ రజత విజేత. నాలుగు డైమండ్‌ లీగ్‌ సిరీస్‌ల్లో పతకాలు గెలిచింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె విజయం ఊహించిందే. ఇక రేసులో పోటీపడ్డ మరో భారత అథ్లెట్‌ నిర్మలా షెరాన్‌ (52.96) త్రుటిలో పతకం చేజార్చుకుంది.

Asian Games 2018

పురుషుల 400మీ ఫైనల్లో మహ్మద్‌ అనాస్‌ 45.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. మహిళల 400మీ హర్డిల్స్‌లో అను రాఘవన్‌, జౌనా ముర్ము ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక మహిళల బాక్సింగ్‌లో సర్జుబాల దేవి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. 51 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో సర్జుబాల 5-0తో గఫరోవా (తజకిస్థాన్‌)ను చిత్తు చేసి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ఆసియా క్రీడల పురుషుల హాకీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ స్వర్ణానికి రెండడుగుల దూరంలో నిలిచింది. ఆదివారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో భారత్‌ 5-3తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

Asian Games 2018

ఆర్చరీలో రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. తెలుగు అమ్మాయి జ్యోతిసురేఖ, మధుమిత కుమారి, ముస్కాన్‌ కిరాలతో కూడిన భారత మహిళల కాంపౌండ్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఈ జట్టు 225-222తో చైనీస్‌ తైపీ జట్టుపై విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌.. దక్షిణ కొరియాను ఢీకొంటుంది. అభిషేక్‌ వర్మ, అమన్‌ సైని, రజత్‌ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు కూడా ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ 230-227తో చైనీస్‌ తైపీ జట్టును ఓడించింది.

- Advertisement -