Asia Cup:స్మృతి రికార్డు బ్రేక్!

1
- Advertisement -

మహిళల ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌పై 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన విధ్వంసకర సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి భారత్‌ను సెమీస్‌కు చేర్చింది. ఆమె ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో మందాన పలు చారిత్రాత్మక రికార్డులను తిరగరాసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 18వ సెంచరీ సాధించి, ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ (17 సెంచరీలు) రికార్డును అధిగమించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్ సాధించిన 10,868 అంతర్జాతీయ పరుగుల రికార్డును దాటి, మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మంధాన చరిత్ర సృష్టించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 74 పరుగులు జోడించారు, ఇందులో షెఫాలీ 17 బంతుల్లో 28 పరుగులు చేసింది. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్న మంధాన, ఆ తర్వాత మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకోగా, తదుపరి ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాది మిథాలీ రాజ్ రికార్డును దాటింది. మంధాన మెరుపులతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

Also Read:ISRO:గగన్‌యాన్ అప్‌డేట్

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. పవర్‌ప్లేలో కేవలం 16/1 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో నందిని శర్మ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుని ఓపెనర్ మారిషో హిల్‌ను పెవిలియన్‌కు పంపింది. చివరకు హాంకాంగ్ 16.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. గ్రూప్-ఎ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, శనివారం జరిగే తదుపరి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

- Advertisement -