కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ లో జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టులో భారత్ విజయపరంపర కొనసాగించింది. వార్ వన్ సైడ్‌గా సాగటంతో కీవిస్‌పై 178 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ గెలుపుతో టెస్టుల్లో భారత్ నెంబర్ 1 స్థానాన్ని సోంతం చేసుకుంది.మరో టెస్ట్ మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
376 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కీవిస్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చినా…మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ఓపెనర్ లతమ్ 74,గుప్టిల్ 24,నికోల్ 24,రాంచి 32 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు చేయటంలో విఫలమయ్యారు. ఫలితంగా కీవిస్ 81.1 ఓవర్లలో197 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్లలో అశ్విన్ 3,జడేజా 3,షమీ 3,భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశారు.
అంతకముందు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా (58 నాటౌట్: 120 బంతుల్లో 6×4) మరోసారి తన మార్కు అర్ధశతకం బాదడంతో ఓవర్‌నైట్ స్కోరు 227/8తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ (23), షమీ (1) చివర్లో సాహాకు చక్కని సహకారం అందించారు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే.
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ శతకాలు సాధించిన నాల్గో వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్లో సాహా(54 నాటౌట్, 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించాడు.అంతకుముందు ఈ ఘనతను అందుకున్న భారత వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోని, దిల్వార్ హుస్సేన్, ఫరూఖ్ ఇంజనీర్లు ఉన్నారు. కాగా, ఈ ఫీట్ ను ధోని నాలుగు సార్లు సాధించడం విశేషం. 2008లో మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ధోని తొలిసారి ఈ ఘనతను సాధిచాడు. ఆ తరువాత అదే సిరీస్ లో నాగ్ పూర్ లో జరిగిన టెస్టులో కూడా ధోని రెండు వరుస హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఇక ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో 400 వికెట్లు తీసుకుని అశ్విన్ 400 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పటివరకు 185 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ స్పిన్నర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కోల్‌కత్తాలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్ వికెట్‌ను తీయడంతో అశ్విన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.
* భారత్ తొలి ఇన్నింగ్స్ 316
* న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 204
* భారత్ రెండో ఇన్నింగ్స్ 263
*న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 197
కాన్పూర్‌లో ముగిసిన తొలి టెస్టులో 434 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 197 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.