విశ్వనగరం హైదరాబాద్ వైభవాన్ని మరింత పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మల్టీనేషనల్ కంపెనీలు మినీ ఇండియాగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తుండగా తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ హైదరాబాద్‌లో దాదాపుగా వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మందుకొచ్చింది.
సోమవారం హైదరాబాద్ లో వన్ ప్లస్ మొబైల్స్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఆర్ అండ్ డీ కోసం వన్ ప్లస్ సంస్థ రూ.వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమన్నారు. రెండేళ్లలో 1500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేయనున్నారని కేటీఆర్ తెలిపారు. వన్ ప్లస్ మొబైల్స్ తయారీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందించారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గత సంవత్సరం ఒప్పొ,గత వారం అమెజాన్,ఇప్పుడు వన్ ప్లస్…హైదరాబాద్ శరవేగంగా విశ్వనగరంగా మారతుందోని ట్వీట్ చేశారు సుధీర్ అనే నెటిజన్. హైదరాబాద్ డెవలప్‌మెంట్ చూస్తూంటే హైదరాబాద్ ప్లస్‌గా మారుతోందని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన అసద్..ఈ క్రెడిట్ అంతా కేటీఆర్‌దే అన్నారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ చేసిన కృషి ఫలితంగానే ప్రస్తుతం పెద్ద ఎత్తున కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయని కొనియాడారు అసద్.అంతేగాదు త్వరలో కేటీఆర్…ప్రభుత్వంలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అసద్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.