విషమంగా జైట్లీ ఆరోగ్యం..

491
jaitly
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జైట్లీ పరిస్థితి మరింత విషమించింది.

దీంతో బీజేపీ నాయకులు ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఎయిమ్స్ వైద్యులు పదో తేదీ నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు.

అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.

అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేశారు.

పలు రాష్ట్రాల బీజేపీ ఇంఛార్జీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో అమృత్‌ సర్‌ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అనారోగ్యం కారణాల వల్ల అరుణ్ జైట్లీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్ర మంత్రివర్గంలో కూడా తనకు చోటు కల్పించవద్దని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.

- Advertisement -