‘తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడి’ అనే అంశంపై హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో పలువురు సినీ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు. హీరో పవన్‌కల్యాణ్ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసులను ఆశ్రయించాలని చెప్పడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ‘మా’ ఎదుట నిరసన వ్యక్తం చేసిన శ్రీశక్తి (శ్రీరెడ్డి)తో పాటు పలువురు నటులు తమ కష్టాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రుతి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ ఇస్తే చాలని ఆమె విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమరావతిలో 200 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్నాడని ఆమె తెలిపారు. ఆయనకు మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి కానీ, మహిళా సమస్యలు పరిష్కరించాలని వెళ్తే మాత్రం తమను పట్టించుకోలేదని ఆమె వెల్లడించారు.
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. దీనికి సినీ పెద్దలు ఒక వేదిక ఏర్పాటు చేసి, పరిశ్రమలో జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడీపై ఓపెన్ డిబేట్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 30 సర్జరీలు చేస్తే కానీ హీరోలు కాలేని వారు సినీ పరిశ్రమలో రాజ్యమేలుతున్నారని ఆమె ఎధ్దేవా చేశారు.
చిత్ర పరిశ్రమలోని సమస్యల్ని బయటకు తెచ్చి మాట్లాడటమే కాకుండా ఐక్యంగా సినిమా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి, తాము అండగా ఉంటామని పలు మహిళా సంఘాల నేతలు భరోసా ఇచ్చారు. ప్రొ.రమా మేల్కొటే మాట్లాడుతూ లైంగిక ఆర్థిక, దోపిడీ ఈ ఒక్క పరిశ్రమకే పరిమితం కాలేదన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు జూనియర్ అర్టిస్టులు బయటకు రావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాది జెస్సీ కొరియన్ మాట్లాడుతూ.. శ్రీశక్తి విషయం తెలియగానే వీరికి అండగా ఉండాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. మహిళా సంఘాల నేతలు సంధ్య, సిస్టర్ లిజీ, దేవి, కొండవీటి సత్యవతి, సునీత, రత్న, ఝాన్సీ, ప్రొ.సూరేపల్లి సుజాత తదితరులు మాట్లాడుతూ.. ఇదో చారిత్రక సందర్భమని, విభేదాలు సృష్టించి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరగొచ్చని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.