నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంక వైపు వేగంగా కదులుతోంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఇవాళ తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఒకవేళ ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందితే దీనికి ‘అర్ణబ్’ అనే పేరు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ వాయుగుండం ఇవాళ రాత్రి శ్రీలంక తూర్పు తీరంలో పొట్టువిల్ – ట్రింకోమలి మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీలంకలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.
ఇదే సమయంలో ఈ వాయుగుండం ప్రభావం భారతదేశంపైనా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నేడు, రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తీరప్రాంతాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఐఎండీ స్పష్టం చేసింది.
Also Read:రేవంత్‌కి గ్రూప్ 1 ఆఫీసర్స్ విజ్ఞప్తి

