ఫీల్‌గుడ్ మూవీ పేపర్ బాయ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకడు జయశంకర్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఒక సాహసోపేతమైన కథాంశంతో ‘అరి’ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులు, అంటే అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం) కాన్సెప్ట్‌తో కొత్త ప్రయత్నం చేశారు. మరి జయశంకర్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుందా..?, ఆరితో మరో ఫీల్ గుడ్ మూవీని అందించాడా లేదా చూద్దాం..
కథ:
ఈ సినిమా కథాంశం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాల చుట్టూ తిరుగుతుంది. ఈ ఆరు బలహీనతలకు ప్రతీకగా ఆరు పాత్రలను పరిచయం చేస్తారు. ప్రతి పాత్ర తమలోని ఒక్కో బలహీనతకు లోనై, వింత కోరికలతో (ఉదాహరణకు, సన్నీ లియోన్‌తో రాత్రి గడపడం, చనిపోయిన భర్తను తిరిగి రప్పించడం, రహస్య నిధిని సొంతం చేసుకోవడం) ‘ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును’ అనే ప్రకటన చూసి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తమ కోరికలు తీర్చుకునేందుకు ఆ ఆరుగురూ ఎలాంటి పనులకు సిద్ధపడ్డారు? కోరికలు తీరుస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? అరిషడ్వర్గాలను జయించే మార్గం ఏమిటి? అన్నదే ఈ సినిమా యొక్క ప్రధాన కథాంశం.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీనటులు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ముఖ్యంగా, వినోద్ వర్మ నటన కొన్ని కీలక సన్నివేశాలలో కంటిచూపుతోనే హావభావాలను పలికించి సినిమాకే హైలైట్‌గా నిలిచింది. చతుర, వితుర పాత్రలు అక్కడక్కడా రిలీఫ్ ఇస్తాయి.
ముఖ్యంగా సెకండాఫ్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఆరు పాత్రల్లో వచ్చే మానసిక మార్పు, మరియు నిస్వార్థంగా మారే పరిణామక్రమం అద్భుతంగా చూపించారు. దర్శకుడు జయశంకర్ తాను చెప్పాలనుకున్న సమాజ సందేశాన్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా, సున్నితంగా ప్రేక్షకుడి మనసును తాకేలా చూపించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అత్యంత బలంగా ఉండి, ప్రేక్షకుడికి గూస్ బంప్స్‌ను ఇస్తాయి. చివరకు ప్రేక్షకుడు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తాడు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. ఈ చిత్రానికి సంగీతం, కెమెరా, మరియు వీఎఫ్ఎక్స్ ప్రధాన బలాలు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ఆర్.ఆర్. సినిమా మూడ్‌కు తగ్గట్టుగా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో కూడా వీఎఫ్ఎక్స్ క్వాలిటీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని ధైర్యంగా నిర్మించిన నిర్మాతల కృషి ప్రశంసనీయం.
తీర్పు:
పేపర్ బాయ్ సినిమా తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఆరిగా వచ్చిన జయశంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అరిషడ్వర్గాలు అనే లోతైన అంశాన్ని ఎంచుకుని, సమాజాన్ని తట్టి లేపే గొప్ప సందేశాన్ని అందించిన చిత్రం ‘అరి’. క్లాస్/సందేశాత్మక చిత్రాలను ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన చిత్రం అరి.
రేటింగ్:3/5
Also Read:మారియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

