ఈ నెల 12న మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి సత్యవతి రాథోడ్ లు వరంగల్ లోని మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయం అర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేటీఆర్ పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. నగరంలో జరుగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉగాది నుంచి వరంగల్ లో ప్రతి ఇంటింటికీ మంచినీటిని ప్రతి రోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 95వేల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని ఆన్నారు. అయితే, స్లం ఏరియాల్లో తప్పనిసరిగా కనెక్షన్లు అందేలా చూడాలన్నారు. రూ.1 కే కనెక్షన్ కింద ప్రతి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. కార్పొరేషన్ లోని అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యం, పార్కులు, ప్రణాళికా బద్ధంగా నగర నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్తులో చేపట్టబోయే పనులు, సత్వరమే పూర్తి చేయాల్సిన పలు పనులపైనా మంత్రి సవివరంగా అధికారులతో చర్చించారు.