టీడీపీకి దురమౌతున్న మిత్రపక్షాలు?

32
- Advertisement -

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ కావడం ఎంతటి సంచలనమైందో.. అక్కడి రాజకీయ పరిణామాలు కూడా అంతే చర్చనీయాంశం అవుతున్నాయి. 2015 స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతానికి చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంచితే చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు అడుగులు వేస్తూ వచ్చాయి.

ప్రస్తుతం ఇప్పుడు ఆ పొత్తు అంశం సందిగ్ధంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై జనసేన పార్టీ మరియు బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. విశాఖ ఘటనలో చంద్రబాబు తనకు మద్దతు తెలిపారాని అందుకే తాను ఇప్పుడు మద్దతు పలుకుతున్నాని అంతేతప్పా ఇంకోటి కాదని పవన్ చెప్పడాన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు స్ట్రాంగ్ మద్దతు ఇవ్వడం లేదనేది స్పష్టమౌతోంది. ఇక అటు బీజేపీ అసలు టీడీపీతో సంబంధమే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ కు బీజేపీ మద్దతు కూడా ఉందని వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని అసలు టీడీపీకి తాము మద్దతు ఇవ్వడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. దీంతో కొత్త చర్చలకు తెరలేచినట్లైంది. మొదటి నుంచి కూడా బీజేపీ.. టీడీపీతో దోస్తీ విషయంలో కొంత దూరం పాటిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు తాజా పరిణామాలతో పూర్తిగా టీడీపీతో దూరం పాటిస్తేనే బెటర్ అని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందనే చెప్పాలి.

Also Read:యూఎస్ ఓపెన్‌ విజేతగా జోకోవిచ్..

- Advertisement -