తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులంతా పాస్ అయినట్లేనని తెలిపిన మంత్రి ఆదిమూలపు…విద్యార్ధుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
దీంతో పాటు ఇంటర్ అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసినట్లు తెలిపిన మంత్రి…ఫెయిల్ అయిన విద్యార్ధులు కూడా పాస్ అయినట్లేనని తెలిపారు.ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించిన వారికి రీఫండ్ చేస్తామని తెలిపారు. గ్రేడింగ్‌కు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో కోర్టు జోక్యంతో పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయని గుర్తుచేసిన మంత్రి సురేష్…ఏపీలో స్దానిక పరిస్ధితులకు అనుగణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
పదో తరగతి విద్యార్ధులంతా పాస్ అయినట్లేనని తెలిపారు.ఏపీలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్ధి కూడా కరోనా బారీన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని కానీ రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రోజురోజుకు కంటైన్ మెంట్ జోన్లు కూడా పెరుగుతుండటంతో ఎగ్జామ్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.