ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ కార్యాక్రమం పూర్తైంది. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
తొలుత ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పూర్తిగా తెలుగులోనే ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ లోకేశ్‌ను అభినందించారు. ప్రమాణ స్వీకారం తర్వాత లోకేశ్ గవర్నర్ నరసింహన్, తండ్రి చంద్రబాబు నాయుడులకు పాదాభివందనం చేశారు.
లోకేశ్ తర్వాత ఆంచట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. పితాని తర్వాత వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన చంద్రబాబుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
వీరి తర్వాత తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నేరుగా గవర్నర్, చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బొబ్బిలి రాజవంశానికి చెందిన ఆర్.వి. సుజయకృష్ణ రంగారావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీనియర్ నేత, రాయదుర్గం ఎమెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదికపైకి వస్తుండగా చంద్రబాబు చిరునవ్వుతో కనిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన నేరుగా సీఎం, గవర్నర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన తర్వాత కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
కొవ్వూరు ఎమెల్యే కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన నేరుగా చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఆయన తర్వాత పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్‌నాథ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొత్త మంత్రుల్లో అతిపిన్న వయస్కురాలైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందరి కంటే చివరగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు అభివాదం చేశారు.