లైంగిక వేధింపులుపై స్పందించిన కాజోల్-అనుష్క

289
- Advertisement -

బాలీవుడ్ సినిమా ‘హార్న్ ఓకే ప్లీజ్’ షూటింగ్ సందర్భంగా సీనియర్ నటుడు నానా పటేకర్, కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య తనను లైంగికంగా వేధించారని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు సెలబ్రిటీలు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ స్పందించారు.

మహిళలపై లైంగిక వేధింపులు ఒక సినీ పరిశ్రమలోనే కాదు ప్రతి చోటా ఉన్నాయని కాజోల్ అభిప్రాయపడింది. కానీ తానెప్పుడూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదని కాజోల్ స్పష్టం చేసింది. కానీ వీటి గురించి తాను విన్నానని వెల్లడించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులెవరూ తామే చేశామని మీడియా ముందుకు రారని వ్యాఖ్యానించింది. తన కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పింది. విదేశాల్లో వచ్చిన ‘మీ టూ’ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని కాజోల్ అభిప్రాయపడింది.

Tanushree Dutta

ఇక ఈ వ్యవహారంపై క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య,బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కా శర్మ కూడా స్పందించారు. తనుశ్రీ తన పోరాటాన్ని ధైర్యంగా కొనసాగించాలని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటకు వచ్చి చెప్పడానికి చాలా ధైర్యం కావాలని వ్యాఖ్యానించింది. ‘మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ విధులు నిర్వర్తించేటప్పుడు భయపడకూడదు. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారో, ఎదుటివారు ఎంత శక్తిమంతమైనవారో తెలిసినప్పుడు ముందుకొచ్చి నిజాలను వెల్లడించడానికి చాలా ధైర్యం కావాలి. అది లేకపోవడం వల్లే చాలామంది ఇంకా ముందుకు రావడం లేదు’ అని అనుష్కా శర్మ తనదైన శైలిలో స్పందించారు.

- Advertisement -